Saturday, April 6, 2013

Midhuna Madhanam

మిధున మధనం 

"అద్భుతః" ఈ ఒక్క మాట చాలేమో మిధునం గురించి చెప్పటానికి. కానీ తనివి తీరటం లేదు. ఎంత చెప్పిన తక్కువే అటువంటి ద్రుశ్యకావ్యాన్ని గురించి.

బాలు గారు (అప్పాదాసు)గంధర్వ గాయకుడు అని మన అందరికి తెలుసు కానీ ఆయన ఆ గాంధర్వ సుగంధాన్ని కాసేపు పక్కన పెట్టేసి తనలోని 'నట'రాజుని వెలికి తీసారు ఇందులో. నటించారు అంటే తక్కువగా  ఉంటుంది అండి అందుకే సాక్షాత్తు ఆ నటరాజు అన్నాను.  ఇక అందమైన అమ్మ లక్ష్మి గారి(బుచ్చిలక్ష్మి) గురించి ఏమని వర్ణించాలి? అమ్మని  అమ్మలా బాగా అభినయించింది అంటే ఎలా అవమానించినట్టు ఉంటుందో అలా  ఉంటుంది. అందుచేత ఆవిడ అమ్మలా ఉంది అంటేనే బాగుంటుంది. ఇక ఈ ద్రుశ్యకావ్యం మొదలు కాగానే వినిపించే  మరో అమ్రుతగానం మన యేసుదాసుగారిది. అమృతం ఎలా ఉంటుందో మేము  ఎప్పు డు రుచి ఎరుగము అని ఫిర్యాదు చెయ్యకుండా ఎసుదసుగారిని పంపాడు ఆ భగవంతుడు.  అసలు ఈ మిధునానికి  ప్రాణం పోసిన వ్యక్తి  శ్రీరమణ గారు, ఆయన గురించి మా బాబాయిగారు చెప్పగా విన్నాను. ఇంత రమణీయమైన కావ్యాన్ని రచించిన ఆ రమణ గారు, ఆయన రచన లో మనల్ని రమింప చేసారు అనటం లో అతిశయోక్తి లేదు. ఇక ఈ అధ్బుతాలన్నింటిని ఒక తాటి పైన తెచ్చి , పంచామృతంలా  పంచిన భరణిగారిని ఎన్ని మాటల మాలలతో సత్కరించాలి అంటారు... ఆయనే ఒక మాటల మాంత్రికుడు, ఆయనకీ ఆ మాటలే నిధి మూటలు. ఆ మాటల మూటలని  పేర్చి కొన్ని సంగతులుగా మార్చి ఈ మిధున మధనం లో రాస్తున్నాను. క్షీరసాగర మధనం లో కల్పవ్రిక్షము, కామధేనువు, హాలాహలము వెలికి వచ్చినట్టు ఈ మిధున మధనం లో మిధునం లోని కొన్ని నాకు నచ్చిన మంచి సంగతులని మీ ముందు ఉంచదలిచాను.

తెలుగుదనం గురించి వినటమే కానీ చూడని, అనుభవించని  ఈ తరం వారికి మిధునం  ఒక వడ్డించిన విస్తరాకు. తెలుగు లోగిళ్ళు, తెలుగు వంటలు, తెలుగు పద్ధతులు, తెలుగు పలుకులు అన్ని రంగరించి ఈ మిధునం లో రుచి చూపించారు. ఆ రుచి ఎలా ఉంది అంటే తెలుగింటి ఆవకాయ లాగ కమ్మగా ఉంది, పోదున్నే వంటింట్లోనుండి వచ్చే వేడి వేడి ఫిల్టర్ కాఫీ వాసన లాగ హాయిగా ఉంది, అప్పుడే చిలికిన చల్ల లాగ చిక్కగా చక్కగా ఉంది, చిలక కొట్టిన దోర జామపండులా తీయ్యగా ఉంది... చూస్తుంటే నన్ను అప్పాదాసు ఆవహించినట్టు ఉన్నాడే! ఔను మరి... ఉంటే ఉంటె ఉంది కాని తిండి యావ అప్పదాసుకి, భలే రుచి ఎరిగిన మనిషి. గుత్తి వంకాయ, గోంగూర, ఆవకాయ, పప్పు దప్పళం ఇవి నచ్చని ఆంధ్రుదు ఉంటాడా? ఆవపెట్టిన పనసపొట్టు కూర, కందాబచ్చాలి కూరల రుచి నాకు తెలియదు కానీ మా నాన్నగారు చెప్పగా విన్నాను. వాటికి చాల మంది అభిమానులు ఉన్నారట. అయితే మన అప్పదాసుకు ఈ ధ్యాస కాస్త ఎక్కువే అనుకోండి. అయినా  తన తిండి యావకు ఒక చక్కని సమర్థన  ఇచ్చడుగా అప్పాదాసు.... రాళ్లు తిని అరాయిన్చుకోవాల్సిన వయసులో, గుప్పెడు మాత్రలు మింగుతున్నారు ఈ తరం వాళ్ళు అని, ఆరు పదుల  వయసులో కూడా తాను అంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం తన ఆ తిండే అని చెప్పి చెప్పకనే చెప్పాడు.
http://www.youtube.com/watch?v=tYBXRdWO4mg

అప్పాదాసుని వేళాకోళం ఆడుతూ అతని కోతిపనులకి అడ్డుకట్ట వేస్తూ ఒక అచ్చ తెలుగు ఇల్లాలిగా ఇంటిపనులు అన్నింటినీ చక్కబెడుతుండే బుచ్చిలక్ష్మి ని చూస్తే మన బామ్మలు గుర్తుకురారు. అలా  మన బామ్మలు పెరటిలో పండే తాజా కూరలతో వండి వడ్డిస్తే  ఏ జిహ్వ మటుకు కాదంటుంది? ఆర్గానిక్ ఫుడ్ అంటూ కొత్త పేరు పెట్టేసి ధర పెంచేసి అమ్మే నిత్యావసర వస్తువులు అన్నింటిని పెరటిలోనే పండించుకుని, అప్పటికి అప్పుడు కోసి వండే వంటని మన అప్పాదాసు బుచ్చిలక్ష్మిల జంట కడుపార  తింటారు. అప్పటికప్పుడు కోసే పండుకున్న రుచి రోజులకోద్దీ చల్లబరిచి తింటే ఉంటుందా? బుచ్చి అమెరికా లో ఉండే తన కొడుకుతో మాట్లాడుతూ  "రోజు ఉడకేస్తున్నర, లేదా వారానికి ఒకేసార"? అని అడుగుతుంది, మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు  మమ్మల్ని వెక్కిరిస్తుంటారు "అంత సంపాదిస్తున్నా రెండు మూడు రోజులకి ఒకసారి వండుకుని, అదే పరమాన్నంలా తినే  ఖర్మ ఏమిటో" అని. నిజమే మరి అల తింటే అసిడిటీ రాదూ, మా తరం వంటల్లన్ని నిన్న మొన్నటివేగా. ఆ మధ్య నా  స్నేహితురాలు ఇంటికి భోజనానికి వెళ్ళాల్సి వచ్చింది, రెండు మూడు రకాల కూరలతో విందు సిద్ధం చేసింది. ఎంతో మర్యాదగ వడ్డిస్తూ చెప్పింది, "మీరు వస్తున్నారని నిన్నే వండేసాను అన్ని, మళ్ళీ  ఇప్పుడు హడావిడి ఎందుకు అని" అంది గొప్పగా. అది విన్నాక రుచి గురించి వేరేగా చెప్పేది ఏముంది చెప్పండి.

తిండి గోల పక్కన పెడితే, సెల్ ఫోన్, టీవీ లేని ఇల్లేది?  కానీ వాటిని దూరంగా ఉంచాలనే అప్పాదాసు ఆలోచన మహగొప్పగా లేదు?. ఎందుకంటే టీవీ మాయలో పడి ఎంతమంది ఆడాళ్ళు వంటకి మంగళం పాడటం లేదు. మగాళ్ళు సరే సరి క్రికెట్ వచ్చింది అంటే జీడిపాకంలా అత్తుక్కుపోవటమే, పెళ్ళాం చచ్చిపోతున్న ఈ ఓవర్ అయ్యాక వస్తా అనే పురుషోత్తములు ఎంతమంది లేరు. ఇక పిల్లలు అయితే అది లేనిదే ప్రపంచమే లేదు అనుకుంటున్నారు ఇలా ఇంట్లోవారితోనే communication gap పెంచే టీవీని, సమయాన్ని అంతా మింగేసే సెల్ ఫోన్ ని దూరం చేసి అప్పాదాసు ఓ రకంగా ఆదర్శం అయ్యాడు. కాని బుచ్చి చెప్పిన మాట ("కొత్త తరాన్ని ఆహ్వానించాలి పాతతరాన్ని గౌరవించాలి" ) కూడా వాస్తవమే కదా సుమండీ!. ఎ వస్తువుని ఎంతవరకు వాడుకోవాలో తెలియక కాని లేదంటే technology ఏమి తప్పుకాదే.

ఈ మధ్య Sustainable living అంటూ ప్రచారం జరుగుతోంది. మన పూర్వీకులు అంతా sustainable పద్ధతులే పాటించారు. మనమే ఆధునీకత  మాయలో పడి దాన్ని గాలికి వదిలేసాము కానీ ప్రస్తుతం ఉన్న వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, నీటి ఎద్దడి చూస్తుంటే ఎవరికైనా మన పాత పద్ధతులు గొప్పగా అనిపించకుండా ఉండవు. ఒక environmental engineer గా  నేను చేసే పని  కూడా అదే. కాని ఈ సినిమాలో ఈ జంట జీవనశైలి చూస్తే ఇప్పటి పరిస్థితికి సరైన సమాధానంలా అనిపించింది. చిన్నపెంకుటిల్లు, పెద్ద పెరడు, బోలెడు చెట్లు, చల్లటి గాలి, తాజా కూరలు, స్వచ్చమైన నీరు, వీటికోసం ఏకంగా కోట్లు వెచ్చించి  research లే చేస్తున్నారు. ఇవే ప్రతిమనిషికి ఇప్పుడు అవసరం. ఒకప్పుడు అవి వద్దని వదిలేసినా మనమే, మళ్ళీ అవే కావాలని వెంపర్లాడుతున్నాం.

ఇక ఈ  జంట జీవన విధానానికి వస్తే, వారి  దినసరి ఎంత సొగసరిగా చూపించారో. భార్యభర్త ఇష్టపడి  కలిసి చేసే ప్రతిపని రొమాన్స్ కిందే లెక్క. అందులోనూ ఈ జంట చేసే పనులు అన్ని ఇన్ని కావు. పిండి రుబ్బటం, విసరటం, నీళ్ళు తోడటం, పెరటి పని చేసుకోటం, పాడిని చూసుకోటం,...ఇల ఎన్నో పనులు కలిసి చేసుకోటం లో ఎంత  మజా ఉంది అన్నది ప్రస్పుటంగా చూపించారు. అలాగే బుచ్చి చీర ఉతుకుతూ, ఆమె కాళ్ళు నొక్కుతూ  అందులో కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు  అప్పాదాసు.  romance అంటే ఖరీదైన హోటల్లో కోవత్తి వెలుగులో కనిపించీ కనిపించని  మొహాల మధ్య, చూపించి చూపించక ఉండే ఆ పదార్ధాన్ని అమృతం లా భావిస్తూ (భావించక చస్తామా బిల్లు చాంతాడు అంట ఉంటే) స్టైల్ గా మెల్ల మెల్లగా తింటూ(కట్టే బిల్లుకి పూర్తి న్యాయం చేసేలా), హీరో హీరోయిన్ లాగ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ (కనపడదు కదా  సరిగ్గా) గడపటం కాదు. అటువంటి romance మహా అయితే  సంవత్సరానికి ఒక్కసారే బాగుంటుంది. కాని రొజూ చేసే చిన్న పనులు కూడా కలిసి చేసుకునే  romance, ఒకరికి ఒకరు సాయపడే romance  సంవత్సరం అంతా బాగుంటుంది.

ఇది ఇలా ఉంటె, చిన్న చిన్న పనులకి కూడా మిషన్ల మీద ఆధారపడటం, పనిపిల్ల రాకపోతే ఏదో అనర్ధం లాగ భావించటం, కూర్చున్న చోటనుండి కదలకుండా అన్ని ఆర్డర్ పైన చేయించుకోటం, ఆ పైన ఒళ్ళు వచ్చి పడిపోతుంది అంటూ వేలకి వేలు జిమ్ లకి తగలేస్తాం కాని మన పని మాత్రం మనం చేసుకోము. అదేమిటంటే ఉద్యోగం చేస్తూ అవన్నీ చేసుకోటం ఎలా వీలు ఔతుంది అని వాపోతము. నిజమే టీవీ చూసే సమయం, ఫోన్ మాట్లాడే సమయం వృధా అయిపోతుంది కదా! కాని అప్పాదాసు బుచిచిలక్ష్మి మాత్రం అన్ని పనులు తామే చేసుకుంటూ చక్కటి ఆరోగ్యానికి  అసలు రహస్యం  చెప్పారు... "కాస్త వళ్ళు వంచితే అన్ని అనారోగ్యాలు దూరమే" అందుకే మన బామ్మలు తాతలు ఇప్పటికి మనకంటే చలాకీగా ఉంటారు.

ఇక మనసుకు హత్తుకునే మాట, ఎంతో అర్ధవంతమైన మాట బుచ్చి నోట పలికించారు.  "మనిషిగా పుట్టటం తేలికే కాని మనిషిగా బతకటం కష్టం అని".తన స్నేహితురాలికి సాయం చేస్తే  కృతజ్ఞత తెలుపుతూ వచ్చే ఉత్తరాలని తేరిపార చూసి వెంటనే చిన్చిపారేయటమో, లేదా కుంపటిలో వేసేయటమో  చేస్తుండే అప్పాదాసుకి కాకుండా, ఒకసారి ఆ ఉత్తరం బుచ్చి కంటపడుతుంది, తన భర్త ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతినుండి చేసే సాయాన్ని కన్నీటితో మనకు కళ్ళు చెమర్చే విధంగా ఆ మాట చెప్తుంది.  ఎంతటి మంచి మనసు అతనిది. అంతేకాదు అల్లరి అప్పాదాసు మెత్తటి మనసు తన లేగదూడ దూరం అయినప్పుడు కూడా అర్ధం అవుతుంది.

అమ్మ నాన్న ప్రేమ కధ అని tagline పెట్టారు. నిజంగానే అనేక సందర్భాలలో మన అమ్మ నాన్న దర్సనమిస్తారు. మన అమ్మ నాన్న కీచులాడుకుంటే వాళ్ళ మధ్య ప్రేమే లేదేమో అనుకుంటాము కానీ కీచులడుకోటం కూడా ఒక లాంటి ప్రేమే కదా అని చూపించారు. ఇక పిల్లలు లేనప్పుడు అన్ని పాత్రలు వాళ్ళే అయిపోయి ఆటలు ఆడుకోటం, చిలిపిగా కొట్టుకోవటం,  కొబ్బరి ఆకు బూరలు ఊదటం, పరిపూర్ణంగా జీవితాన్ని అనుభవించటం అంటే అదేనేమొ అన్నట్టు చూపించారు. ఒక వయసు వచ్చాక పిల్లలు దూరంగా వెళ్ళాక, వారి గురించే చింతించకుండా attached detachment అని అనుకుంటూ ఉంటే మనసు  బాధించదు అని అప్పాదాసు చెప్తుంటాడు.  ఒకరికిఒకరు తోడుగా ఉంటూ చిన్న చిన్న సరదాలని కూడా సంతోషంగా అనుభవిస్తూ కాలం గడపటం ఒక యోగం. అది దక్కిన వారు దక్కించుకున్నవారు మహా అదృష్టవంతులు. ఇరవై లో ప్రేమ కంటే అరవై లో ప్రేమ గొప్పదిట. దాన్ని ఆస్వాదించి తీరాలి అనిపించేలా మలిచారు మిధునాన్ని.

పైవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యలో మెరిసే చమక్కులు మరో ఎత్తు.  కాఫీ దండకం, ఆయకాయ పాట, పుష్పవిలాప పద్యం, ఆకాశవాణి, ప్రకాష్ రాజ్ గాత్రదానం, అప్పడం తాత animation,  అప్పాదాసు సన్యాసాన్ని భంగం చేసిన పెసరట్టు ఇలా కొన్ని చాలా  సరదాగా సాగాయి.

అలాగే ఆఖరి సన్నివేసం లో బుచ్చి అప్పాదాసు కన్నుమూసాడు అని తెలిసి అంటుంది... "ఏ  భార్య అయినా  తనకంటే ముందు భర్త పోవాలని కోరదు  కానీ చిన్నపిల్లాడిలాంటి తన భర్తని తనకంటే బాగా చూసుకునే వారెవరు ఉండరు కనుక, భర్తే ముందు పోవాలని  కోరుకున్నా అంటుంది. నిజమైన పతివ్రత అంటే బుచ్చిలక్ష్మే కదా!

శ్రీరమణ గారు రాసిన రచన చదవలేదు కనుక సినిమాకి, అసలు రచనకి పోలిక చెప్పలేను కానీ భరణిగారి రచనా పాండిత్యం ఇదివరలో చూసాం కనుక  ఖచ్చితంగా రచనకంటే మెరుగ్గా తీసి ఉంటారని భావిస్తున్నాను.

శంకరాభరణం లా ఈ మిధునం "రమణాభరణీయం"


జ్యోత్స్న

No comments:

Post a Comment